అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం...

SMTV Desk 2018-01-17 13:31:45  nagoba jatara, start, girijan, keslapoor, adilabad

ఆదిలాబాద్, జనవరి 17: తెలంగాణ గిరిజన జాతరల్లో ముఖ్యమైన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర వైభవంగా మొదలైంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మహాపూజలు నిర్వహించిన అనంతరం జాతరను ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా మర్రి చెట్ల వద్దగల కోనేటి నుంచి తీసుకొచ్చిన జలంతో ఆలయాన్ని శుభ్రపరిచారు. మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు ఆలయం పక్కనున్న పుట్టమన్నును తవ్వి కొత్త పుట్టలను తీర్చిదిద్దారు. మెస్రం వంశీయులు పటేళ్లు, వెంకట్‌రావు, మెస్రం చిన్ను, పూజారులు హన్మంత్‌రావు, కోసురావు, నాయక్‌వాడి మెస్రం ధర్మ, ప్రధాన్‌ తుకుడోజి, దాదేరావు, పేన్‌ కొత్వాల్‌ మెస్రం తిరుపతిలు నాగోబా దేవతను గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చారు. గంగా జలంతో అభిషేకించిన తర్వాత మెస్రం వంశీయులలో ఏడుగురు తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠించి నవధాన్యాలతో పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోలు, కిక్రి వాయిద్యాలతో ఆలయం మార్మోగింది. పూజలకు గిరిజనులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయం, పరిసరాలు కిక్కిరిశాయి.