తెలంగాణాలో 28 పార్టీలతో బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్

SMTV Desk 2018-01-12 17:09:47  bahujana left front, tammineni, nalla, 28 parteis, telangana

హైదరాబాద్, జనవరి 12: రాజ్యాధికారమే లక్ష్యంగా, నియంత పాలన ముగింపు కోసం తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు అంకురార్పణ జరిగింది. జనవరి 25న 28 పార్టీలతో కలిసి బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ఏర్పాటు కానుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయాలని లెఫ్ట్, బహుజన నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌లో 25న భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఈ వేదికను ప్రకటించనున్నారు. బహిరంగ సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్, ఎంసీపీఐ (యూ) జాతీయ నేత ఎం.డి.గౌస్‌ హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటుపై సన్నాహక సమావేశం జరిగింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, కాకి మాధవరావు, పి.ఎల్‌. విశ్వేశ్వరరావు, సాంబ శివరావు, గద్దర్, పటేల్‌ వనిత, మాజిదుల్లా ఖాన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు.