ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాయింట్లు..12దాటితే లైసెన్సు రద్దు!

SMTV Desk 2018-01-11 12:03:36  trafic police, points, rules break, dcp, ranganadh, jail, licence cancel

హైదరాబాద్, జనవరి 11: రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ లు నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్దమయ్యారు. ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ..హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, కూడళ్లలో సూచికలను పాటించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనలకు బ్రేకులు పడనున్నాయి! నిబంధనలు ఉల్లంఘించే వారికి గత ఆగస్టు నుంచి పోలీసులు అపరాధ సంఖ్యలను (పాయింట్లు) ఇస్తున్నారు. ఈ పాయింట్లు 12 దాటిన వాహనదారుడి చోదక లైసెన్సు ఏడాదిపాటు రద్దు కానుంది. ఆ గడువులోగా మళ్లీ వాహనం నడిపితే సదరు వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదు! హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను రోజూ గుర్తించి, ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో పాయింట్లు వేస్తున్నారు. 13వ పాయింటు నమోదుకాగానే లైసెన్సు రద్దయ్యేలా ఏర్పాట్లుచేశారు. పాయింట్లు నమోదవుతున్నాయని తెలిసినా చాలామంది చోదకులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఒకసారి లైసెన్సు రద్దయ్యాక... మళ్లీ వాహనం నడిపితే నెల రోజులకుపైగా జైలుశిక్ష విధించే అవకాశముందని ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.