బీటలు వారుతున్న వివాహబంధం..!

SMTV Desk 2018-01-08 13:18:38  marriege, relations, breakup, couples, bond

హైదరాబాద్, జనవరి 08: ఒకరిపై ఒకరికి ప్రగాఢ నమ్మకంతో మూడుముళ్ళు ..ఏడు అడుగులతో వివాహబంధం ఒకటవుతుంది. భర్తను దైవంగా..భార్యను భర్తలో సగభాగంగా కొలిచే మన సమాజం నేడు వికృత పోకడలను చవిచూస్తుంది. భార్యను చంపడానికి సుపారీ ఇస్తారొకరు...భర్తను చంపడానికి ప్రియుడితో కలిసి పథకం వేస్తారు మరొకరు... ప్రియుడితోనే చంపిస్తారు ఇంకొకరు.. ఇలా వివాహ బంధాల చుట్టూ వివాహేతర సంబంధాల చీకట్లు అలుముకుంటున్నాయి. శారీరక ఆకర్షణ, విలాసవంతమైన జీవనం, పెళ్లికి ముందు ప్రేమాయణం.. ఎన్నో వివాహ బంధాల్ని విచ్ఛిన్నం చేస్తోంది. కట్టుకున్న వాడితో కడదాకా ఉంటానని చేసిన ప్రమాణాన్ని మరచి భర్తలనే కడతేరుస్తున్న భార్యలను, జీవితాంతం తోడుంటానని ఏడడుగులు వేసిన భర్తలు ఏడు నెలలైనా కాకుండానే భార్యలను చంపడాన్నీ చూస్తున్నాం. వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తుందన్న ఉద్దేశంతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు కిరాయి హంతకులతో భార్యను హత్య చేయించాడు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఓ వివాహిత థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత భర్తపై రసాయనిక దాడి జరిగిందని పేర్కొంటూ ప్రియుడినే భర్తలా చూపి ఆసుపత్రిలో చేర్పించింది. కర్నూలు జిల్లాలో చిన్న మద్దిలేటి అనే వ్యక్తికి అక్క కుమార్తెతో వివాహమైంది. అతడితో కాపురం చేయడం ఇష్టంలేని ఆమె ట్రాక్టరు డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అతనితో భర్తను చంపించింది. ప్రలోభాలకు గురై... దురాశతో.. ఆధునిక జీవనశైలి అనే భ్రమతో.. సినిమాలు సీరియళ్ల ప్రభావంతో.. కొందరు వివాహేతర సంబంధాల్లో మునిగి తేలుతున్నారు. వివాహేతర సంబంధంతో వచ్చే సుఃఖంకన్నా బయటపడితే వచ్చే నష్టం వెయ్యి రెట్లు ఎక్కువని ఆలోచించగలిగితే మనస్సు నియంత్రణలో ఉంటుంది. శారీరక సుఖాల క౦టే మానవ విలువలు, సాంఘిక, సమాజ కట్టుబాట్లకు ప్రాధాన్యం ఇస్తే ఇటువంటి సంఘటనలు అదుపులో ఉంటాయి.