ఉద్యోగాలు కల్పించే ఏజెన్సీగా న్యాక్‌..!

SMTV Desk 2018-01-06 14:46:39  National Construction Company, minister tummala nagaeshwar rao,

హైదరాబాద్, జనవరి 6 : జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్‌)ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సంస్థగా రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో జరిగిన న్యాక్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో ఉన్న కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. మరో రెండు నెలల్లో జాతీయ సమావేశాల నిర్వహణకు, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ను బలోపేతం చేసేందుకు సామగ్రి, యంత్రాల సేకరణకు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా న్యాక్‌ను(జాతీయ నిర్మాణ సంస్థ) తీర్చిదిద్దాలన్నారు. న్యాక్‌ ఏర్పడినప్పటి నుండి 3.76 లక్షల మంది శిక్షణ పొందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా న్యాక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 12 శాతానికి పెంచామని, రవాణా ఖర్చులకు నెలకు రూ.250 పెంపుకై ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సర్వీసులను కూడా న్యాక్‌ అందిస్తోందని తుమ్మల పేర్కొన్నారు.