వివాహేతర సంబంధం.. బలిగొంది నిండు ప్రాణం

SMTV Desk 2018-01-05 13:03:17  chotuppal, murder, culprits jyothi,karthik, hyderabad

చౌటుప్పల్, జనవరి 5 : మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి..పెళ్లిలో ఏడూ అడుగులు నడిచి జీవితాంతం కలిసి ఉంటామనే మాటను మర్చిపోయి రాక్షసుల్లా ప్రవర్తించి కట్టుకున్న వారినే కడతెరుస్తున్నారు. ఇటీవల స్వాతి అనే మహిళా తన ప్రియుడి తో కలిసి జీవించాలని తన భర్తను హతమార్చిన ఉదంతం మరవక ముందే మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఒక యువతి ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. మృతదేహాన్ని తీసుకెళ్లి ఊరిబయట పడేసింది. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఐదురోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కాల్‌ డేటా సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడిందని తేల్చారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా రాచర్లకు చెందిన జ్యోతి(24)కి అదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అంతకుముందు ఆమె నాచారంలో ఉంటున్న తన మేనమామ ఇంటికి తరచూ వచ్చేది. అక్కడికి సమీపంలో ఉంటున్న కార్తీక్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా జ్యోతి తల్లిదండ్రులు నాగరాజుతో పెళ్లి చేశారు. ఉపాధి కోసం హైదరాబాద్‌ చేరుకున్న నాగరాజు భార్యతో కలిసి కర్మన్‌ఘాట్‌లో కాపురం పెట్టాడు. కానీ జ్యోతి కార్తీక్ ను తరుచూ కలుస్తూ ఉండేది. ఇది గమనించిన భర్త నాగరాజు ఆమె తీరు మార్చుకోవాలని మందలించాడు. కానీ నిందితురాలు తీరు మారకపోగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలిగించుకోవాలని నిర్ణయించుకుంది. డిసెంబరు 30న రాత్రి ప్రియుడు కార్తీక్ తో కలిసి ప్లాన్ సిద్దం చేసింది. అతడు వచ్చాక భర్త ముఖంపై దిండుతో బలంగా ఒత్తేసి చంపేశారు. తర్వాత కార్తీక్‌ తన స్నేహితుడైన దీపక్‌కు ఫోన్‌చేసి కారు తీసుకురావాలని చెప్పాడు. దీపక్‌ మిగతా మిత్రులైన యాసిన్‌, నరేష్‌లు కలిసి కారు తీసుకుని కర్మన్‌ఘాట్‌కు వెళ్లారు. అంతా కలిసి నాగరాజు మృతదేహాన్ని అందులోకి ఎక్కించి చౌటుప్పల్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ఎవరులేని ప్రాంతంలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు. తర్వాత రోజు చౌటుప్పల్‌ పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించి అతడి జేబులో దొరికిన చిట్టీ ఆధారంగా అతడి చిరునామా గుర్తించి జ్యోతికి ఫోన్‌ చేశారు. ఠాణాకు చేరుకున్న ఆమె తన భర్త రెండురోజుల నుంచి కనిపించడం లేదని చెప్పింది. అతడి మృతదేహాన్ని చూసి రోదించింది.కాగా శవపరీక్ష నివేదికలో నాగరాజు తల వెనుక దెబ్బలున్నాయని వెల్లడికావడంతో పోలీసులు అతడి ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించారు. డిసెంబరు 30న స్విచ్చాఫ్‌ అని తేలింది. వెంటనే జ్యోతి ఫోన్‌ వివరాలను సేకరించగా, డిసెంబరు 30, 31 తేదీల్లో ఒకే నంబరుకు ఎక్కువగా కాల్స్‌ ఉన్నట్టు తేలింది. ఆ నంబరు కార్తీక్‌దిగా గుర్తించారు. బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేశామని అంగీకరించాడు. దీంతో పోలీసులు గురువారం దీపక్‌, యాసిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మరో నిందితుడైన నరేష్‌ లాలాపేట స్టేషన్‌కు వెళ్లి లొంగిపోదామనే ఉద్దేశంతో డయల్‌ 100కు ఫోన్‌చేయగా,పోలీసులు స్పందించలేదు. భయంతో అతడు గొంతు కోసుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ప్రాణాలకు ముప్పేమీ లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.