ఇకపై నేరస్థుల కోసం పోలీసుల గాలింపులు ఫోన్లోనే!

SMTV Desk 2018-01-02 17:45:21  TSCOP Mobile App, DJP Mahendarreddy, hyderabad

హైదరాబాద్, జనవరి 02 : తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ 2018ని సాంకేతిక నామ సంవత్సరంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళికను అమలులోకి పెట్టింది. పోలీసు సిబ్బందికి సమస్త సమాచారం అందుబాటులో ఉండేలా టీఎస్ కాప్ పేరుతో నూతన మొబైల్ యాప్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం రాజధానికి పరిమితమైన హైదరాబాద్ కాప్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అయితే, రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేసే పోలీసు సిబ్బందికి అవసరమైన సమాచారం అంతా ఈ యాప్ లో ఉంటుంది. హైదరాబాద్ లో కూడా కాప్ పేరుతో, కొంతకాలంగా యాప్ ను వినియోగిస్తున్నారు. ఆ యాప్ కు మరింత సమాచారం జోడించి మొత్తం 54 అంశాలతో టీఎస్ కాప్ ను రూపొందించారు. కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు పెట్రోలింగ్ వాహనాల్లోని సిబ్బంది, కోర్టు కానిస్టేబులకు అవసరమైన సమాచారం ఇందులో ఉంటుంది. అలాగే నేరస్థులు ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఏ ఏ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి? కోర్టు శిక్షలు తదితర విషయాలు ఇలా అన్ని వివరాలు ఈ యాప్ లోనే పొందుపరిచి ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.