మోదీ విధానాలు దేశ ప్రజలకు శాపం :బృందా కారత్

SMTV Desk 2017-12-15 12:12:28  brunda karat, comments, modi, miryalaguda, reforms

మిర్యాలగూడ, డిసెంబర్ 15: మోదీ సంస్కరణలు, విధానాలు దేశ ప్రజల నడ్డి విరిచాయని సీపీఎం జాతీయ కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ద్వారా నల్ల కుభేరుల వద్ద ఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చి కార్పొరేట్‌ కంపెనీలు, పెట్టుబడిదారులకు మోదీ మేలు చేశారని ఆమె విమర్శించారు. జీఎస్టీ ద్వారా వ్యాపారులతో పాటు పేదలను దెబ్బ తీయడంలో మోదీ ప్రపంచ రికార్డు సాధించారని ఆమె ఎద్దేవా చేశారు. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలు, పారిశ్రామికవేత్తల మెప్పు కోసం ప్రాజెక్టుల పేరుతో రైతుల నుంచి లక్షల ఎకరాల భూమి లాక్కుందని బృందాకారత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది కౌలు రైతులుండగా వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోని సీఎం కేసీఆర్‌, భూస్వాములైన పట్టాదారులకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడులు అందించడం భావ్యం కాదని ఆమె ఆరోపించారు.