ఈ నెల 3న బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం

SMTV Desk 2017-12-02 11:37:00  BC, CM KCR, Legislative Committee Hall, Hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 02 ‌: రాష్ట్రంలో వెనుకబడిన బీసీ కులాలవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఈ నెల 3న బీసీ ప్రజాప్రతినిధులతో శాసనసభా కమిటీ హాలులో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీలో గతనెలలో జరిగిన బీసీల చర్చల్లో భాగంగా స్పందించిన సీఎం కేసీఆర్‌, డిసెంబరు 3న అన్ని పార్టీల బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగా ఆదివారం సమావేశానికి రంగం సిద్ధమైంది. అన్ని పార్టీల బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దీనికి అనుమతించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సీఎం ఈ సమావేశంలో చర్చించి, తమ నిర్ణయాలను వెల్లడిస్తారని సమాచారం. తమ తమ పార్టీల తరపున బీసీల సమస్యలను తమ దృష్టికి తీసుకొని రావాలని ఇప్పటికే సీఎం ప్రజాప్రతినిధులకు సూచించారు. వారు ప్రస్తావించే అంశాలతోపాటు ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ వెల్లడించే వీలుంది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా తెరాస ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. బీసీ సంఘాల నేతలతో చర్చలు సాగిస్తున్నారు. నేడు సైతం భేటీలు జరుగనున్నాయి. ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా భావిస్తున్న సీఎం, బీసీల సమస్యలు, డిమాండ్లు, వాటికి పరిష్కారంగా తీసుకోనున్న నిర్ణయాలపై మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.