రేషన్ డీలర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం..!

SMTV Desk 2017-12-01 15:42:37  kcr, ration dealers, strike, pds, eetela

హైదరాబాద్, డిసెంబర్ 01: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన సరుకులు రేషన్ డీలర్ల సమ్మెతో ఆగిపోయాయి. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిలో రూపాయికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. కమీషన్‌ పద్ధతిన పనిచేస్తున్న రేషన్ డీలర్లు వేతనాలు పెంచాలని, హెల్త్‌కార్డులు అందించాలనే డిమాండ్లతో డీడీలు కట్టకుండా సమ్మెకు సిద్దమయ్యారు. ఈ విషయంపై గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, కమిషనర్‌ సీవీఆనంద్‌లతో పౌరసరఫరాల శాఖపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రూ.వేలకోట్ల సబ్సిడీ భారాన్ని మోస్తూ పేదలకు అన్నం పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంటే, అసమంజసమైన డిమాండ్లతో సమ్మెకు పిలుపునివ్వడం అర్ధం లేని చర్య అని డీడీలు కట్టని రేషన్ డీలర్లును తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సరుకుల పంపిణీలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని ఆయన సూచించారు.