ఢిల్లీలోని కేంద్ర మంత్రితో సమావేశమైన హరీశ్‌రావు

SMTV Desk 2017-11-30 12:20:15  Irrigation Minister Harisravu, Union Forest and Environment Minister Harshavardhan, meeting, delhi

హైదరాబాద్, నవంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల మంతనాలకై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఎంపీలు వినోద్‌కుమార్‌, బీబీ పాటిల్‌లతో కలిసి హరీశ్‌రావు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు వేగవంతంగా మంజూరయ్యేలా ఉమ్మడి విధానాన్ని (సిండికేట్‌ పాలసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ఆయన విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సమావేశంలో భాగంగా సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. రైల్వే, నీటిపారుదల, జాతీయ రహదారులకు సంబంధించిన అనుమతులను అత్యవసర అంశాలుగా చూడాలని, వీటిని ఉమ్మడి విధానం ద్వారా మంజూరు చేస్తే ప్రాజెక్టులు త్వరతగతిన పూర్తి అవుతాయని వారితో వివరించినట్లు ఆయన వెల్లడించారు.