అమెరికా అతిధి వచ్చేశారు...

SMTV Desk 2017-11-28 09:36:22  ivanka trump, hyderabad, tour, ivankaPM Modi, Global Entrepreneurship Summit

హైదరాబాద్, నవంబర్ 28 : అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో అమెరికన్‌, తెలంగాణ అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య నేరుగా మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌కు బయల్దేరారు. ఇవాంక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. అనంత‌రం హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నారు. మియాపూర్ లో మెట్రో రైలు ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ హెలికాప్టర్ ద్వారా హెచ్ఐసీసీ వేదికకు వస్తారు. ప్రధాని మోదీని ఇవాంక‌ మర్యాదపూర్వకంగా కలుస్తారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించిన తర్వాత.. పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్రధాని మోదీ , ఇవాంక వెళ్తారు. ఈ నెల 29వ తేదీ ఉదయం ఇవాంక హెచ్ఐసీసీలోని సదస్సుకు వెళ్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో ట్రైడెంట్‌ హోటల్లో భేటీ అవుతారు. సాయంత్రం 5:35 గంటలకు హోటల్‌ ఖాళీ చేయనున్న ఇవాంకా, రాత్రి 8.20కి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యలో ఏం చేస్తారన్నది షెడ్యూల్‌లో పేర్కొనలేదు. తర్వాత 8.20 నిముషాలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, 9.20 నిముషాలకు దుబాయ్‌ ఎమిరేట్స్‌ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో.. ఏకంగా 18 గంటల పాటు రిజర్వ్‌ టైమ్‌గా నిర్దేశించారు. మంగళవారం తెల్లవారుజామున విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకోనున్న ఇవాంకా మధ్యాహ్నం 2.50 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయాన్ని షెడ్యూల్‌లో ‘రిజర్వ్‌’గా చూపారు. ఈ సమయంలో ఇవాంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారా.. అన్నది ఆసక్తి రేపుతోంది. ఇవాంకా రాకతో నగరం నలుమూలలా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.