ప్రపంచ పారిశ్రామివేత్తల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ

SMTV Desk 2017-11-26 17:07:26  dgp, telangana, security, ges, hicc

హైదరాబాద్, నవంబర్: ఈ నెల 28న ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, ప్రధాని మోదీ 28న నగరానికి వస్తారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 10,400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎస్పీజీ, అమెరికా భద్రతా సంస్థలతో సమన్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతా చర్యల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. 28న ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇవాంక చేరుకుంటారని తెలిపారు. జీఈఎస్ సదస్సు ముగిసిన అనంతరం 29న సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి అమెరికాకు పయనమవుతారని డీజీపీ చెప్పారు. ఇక పారిశ్రామికవేత్తలు బస చేసే హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. గోల్కొండ, ఫలక్‌నూమా వద్ద భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. జీఈఎస్‌కు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నగర వాసులు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా డీజీపీ కోరారు.