పెట్టుబడులకు భారత్ స్వర్గధామం : మంత్రి కేటీఆర్

SMTV Desk 2017-11-26 14:23:23  ktr, ges, investments, india, neeti ayog, hyderabad

హైదరాబాద్, నవంబర్ 26: హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికంగా యువత భారత్‌లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నూతన ఆలోచనలకు భారత్ వేదికగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్‌ని ప్రపంచమంతా ప్రశంసిస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అసవరం ఉందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన మూడున్నరేళ్లలోనే అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు రాష్ట్రం వేదికగా మారిందని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలతో ముందుకు వచ్చి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న విషయం విదితమే. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సన్నాహక సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వ్యాపార అనుభవాలను యువ పారిశ్రామికవేత్తలు పంచుకున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా యువ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో టీహబ్, ఐఎన్‌కే సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించింది.