ఇవాంక రాకతో నగరంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు

SMTV Desk 2017-11-25 13:25:00  ivanka trump, Security arrangements, hyderabad,

హైదరాబాద్, నవంబర్ 25 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారై ఇవాంక ట్రంప్ ఈ నెల 28న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ (జీఈఎస్) సదస్సులో పాల్గొనేందుకు, హైదరాబాద్ రానున్న సందర్భంగా నగరంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఇవాంకా ట్రంప్ ల్యాండైన దగ్గర్నుంచి తిరిగి విమానాశ్రయంలో విమానం ఎక్కేవరకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు. అలాగే శంషాబాద్, ఎయిర్ పోర్ట్ కు వచ్చిపోయే మార్గాల్లో 24 గంటల పహారా ఏర్పాటు చేశారు. ఆమె వెంట 350 మంది రానుండటంతో, వారి భద్రతా కార్యక్రమాలు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమెండోలు, ఇవాంకా వ్యక్తిగత భద్రత సిబ్బంది చూసుకుంటాయి. ఇవాంక వెళ్లే ఈ సదస్సు చుట్టూ 4 కిలోమీటర్ల వరకు మనిషి చొరబడకుండా పోలీసులు భద్రత కల్పిస్తారు. అనంతరం ఫలక్‌ నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో జరిగే విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విందులో వివిధ రకాల వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లోని నిఘా ఏర్పాటు చేశారు. ఆ మార్గాల్లోని షాపుల యజమానుల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హెచ్ఐసీసీ నుంచి 45 బస్సుల్లో నాలుగు దఫాలుగా ప్రతినిధులను ఫలక్‌ నుమా ప్యాలెస్ కు విందుకోసం చేరుస్తారు. కాగా, 29న ఇవాంకా పర్యటనకు సంబంధించిన వివరాలేమీ తమవద్ద లేవని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇవాంకా భద్రతా సిబ్బందికి కూడా తెలియదని, ఆ రోజు ఇవాంకా ఎలా చెబితే అలా చేస్తామని వారు చెబుతున్నారు. లాడెన్‌ జాడ పసిగట్టేందుకు వాడిన బెల్జియం మాలినోస్‌ జాతి కుక్కలను, ల్యాబ్రడార్‌, జర్మన్‌ షెఫర్డ్‌ కుక్కలను సదస్సు ప్రాంగణంలో రక్షణ కోసం వాడనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి సదస్సు ప్రాంగణానికి, ఫలక్ నుమా ప్యాలెస్ తదితర ప్రాంతాల్లో తిరిగేందుకు ఇవాంకా కోసం మూడు వాహనాలను అమెరికా నుంచి అధికారులు తీసుకురాగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వాహనాలను సమకూర్చనుంది. సదస్సు అనంతరం ఆమె నేరుగా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనుంది.