వాళ్ల రాకతో నగరంలో భద్రతలపై నిఘా

SMTV Desk 2017-11-24 12:03:50  Modi, Prime Minister Modi, hyderabad, cm kcr, police

హైదరాబాద్‌, నవంబరు 24 : ఈ నెల 28న హైదరాబాద్ కు విచ్చేయనున్న అమెరికా అధ్యక్షుడి కుమారై ఇవాంక, ప్రధాని మోదీ రాకతో నగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.ఈ మేరకు భద్రత బాధ్యతలను 11 మంది ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. వీరిలో ఐదుగురు ఐజీ స్థాయి అధికారులు, ఇద్దరు అడిషనల్‌ సీపీలుండగా.. మిగిలినవారిలో డీసీపీలు, ఒక ఎస్పీ ఉన్నారు. అలాగే నగర సుందరీకరణ, రవాణా, స్వచ్చంద సేవ, విమానాశ్రయం-రిసెప్షన్‌, రాష్ట్ర ప్రభుత్వ రిసెప్షన్‌, మీడియా కోఆర్డినేషన్‌ కమిటీలనూ ఏర్పాటు చేశారు. జీఈఎస్‌, మెట్రో ప్రారంభం సందర్భంగా ఐపీఎస్ లకు , ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. శనివారం నుంచి సమ్మిట్‌ ముగిసి ప్రతినిధులు తిరిగి వెళ్లేంతవరకు భద్రతాపరంగా ఐపీఎస్‌ అధికారులదే బాధ్యత. ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లను ఐజీ స్థాయి సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. ఫలక్‌నూమా హోటల్‌, గోల్కొండ కోటలో పరిధిలోని ప్రాంతాల్లో అడిషనల్‌ సీపీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారు. ఎస్పీజీ, అమెరికా పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లతో 11 మంది ఐపీఎస్లు నేడు సమావేశమై స్థానిక పరిస్థితుల గురించి పూర్తిగా ఆరా తీయనున్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌కు చెందిన నిష్ణాతులైన సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. జీఈఎస్‌ జరిగే హెచ్‌ఐసీసీ, మెట్రో రైలును ఆరంభించనున్న మియాపూర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసర ప్రాంతాల్లో సాధారణ పోలీస్‌ బందోబస్తుతో పాటు ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ బలగాలనూ మోహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్నైపర్‌ రైఫిళ్లతో బలగాలు మోహరిస్తాయి. కాగా, ఇవాంకా ట్రంప్‌ ప్రత్యేక విమానంలో మూడు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ మైన్‌ రెసిస్టెంట్‌ వాహనాలు వస్తున్నాయి. ఆ వాహనాల్లోనే ఇవాంకా తిరుగుతారు. ఆమె కాన్వాయ్‌ను హైదరాబాద్‌, సైబరాబాద్‌కు చెందిన ఆరు పోలీస్‌ వాహనాలు అనుసరిస్తాయి. ఈ నెల 25న హెచ్‌ఐసీసీ, మియాపూర్‌ మెట్రో స్టేషన్‌, ఫలక్‌నుమా ప్యాలె్‌సలను పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటారు. అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌ అధికారులు, కేంద్ర హోం శాఖ, రా, ఎస్పీజీ, తెలంగాణ పోలీసులు మంగళవారం సమావేశమై భద్రత ఏర్పాట్లపై చర్చించారు.