దంతాలు జాగ్రత్త... లేకపోతే గుండెకు చేటు తప్పదు...

SMTV Desk 2017-11-15 14:48:20  brushing teeth, care about tooths, daily habit, heart related problems

హైదరాబాద్, నవంబర్ 15 : దైనందిన జీవితంలో మనుషుల దినచర్య ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. కానీ ఈ ప్రక్రియను చాలా మంది నిర్లక్ష్యంగా చేస్తున్నారు. దీని కారణంగా దంత క్షయం, పంటి సమస్యలు, దంతాలు పుచ్చి పోవడం, వంటి సమస్యలు ఎదురవుతాయి. మాములుగా రోజూ ఉదయం, రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. కానీ మన దేశంలో దీన్ని ఆచరించే వారి సంఖ్య ఐదు శాతం కూడా ఉండదు. విద్యావంతులు కూడా దీన్ని సరిగ్గా ఆచరించడం లేదు. కనీసం రెండు నిమిషాల పాటు దంతాలను బ్రషింగ్ చేసుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెబుతారు. మూడు నిమిషాల వరకు బ్రష్ చేసుకోవచ్చు. కాకపోతే బ్రష్ తో దంతాల పై బాల ప్రయోగం చేయకూడదు. అలా చేయడం వల్ల పళ్లపై రక్షణ పొర ఎనామెల్ అరిగిపోతుంది. ఎనామెల్ అరిగిపోతే వేడి, చల్లటి, పుల్లటి వస్తువులు తీసుకున్న సమయంలో పళ్లు జివ్వున లాగుతుంటాయి. దీన్నే సెన్సిటివిటీగా చెబుతారు. దంత సంరక్షణకు రోజూ బ్రష్ చేసుకోవడం ఎంత అవసరమో ఫ్లాసింగ్ కూడా అంతే. దీన్ని ఆచరించే వారు చాలా చాలా అరుదు. దేశంలో కనీసం ఒక శాతం కూడా ఉండరేమో. ఫ్లాసింగ్ అన్నది దంతాలపై ఏర్పడుతున్న ప్లాక్యూను తొలగించేందుకు. అలాగే, పళ్ల మధ్యలో పేరుకున్న, ఇరుకున్న ఆహార పదార్థాలను కూడా తొలగించడం దీనిలోని ప్రయోజనం. ఫ్లాసింగ్, బ్రషింగ్ రెండింటి ప్రయోజనాలు ఒకటే. టూత్ బ్రష్ అన్నది పళ్ల మూల మూలల్లోకి వెళ్లి అన్ని చోట్ల తిష్టవేసుకున్న పదార్థాలను తొలగించలేదు. ఫ్లాసింగ్ లో అది సాధ్యమవుతుంది. బ్రష్ పళ్లకు ఉపయోగించిన వైరు లాంటిదాన్నే ఫ్లాసింగ్ కు వాడతారు. పెరియోడాంటల్ వ్యాధులు గుండె జబ్బుల రిస్క్ ను పెంచుతాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నోటి లోపల ఇన్ఫెక్షన్ వస్తే అది రక్తంలో ఇన్ ఫ్లమ్మేటరీ పదార్థాలను పెంచుతుంది. దీంతో రక్తం గడ్డకట్టడం, గుండెకు రక్త సరఫరా తగ్గి గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే, నోటిలోపల ఇన్ఫెక్షన్ కు కారణమైన బ్యాక్టీరియా అతి సులువుగా రక్తప్రవాహ మార్గంలో కలిసి గుండె, రక్తనాళాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్యలో ఉన్న ఆహార పదార్థాలు, చెడు పదార్థాలు తొలగిపోయి, పళ్లు పుచ్చిపోకుండా నివారిస్తుంది.