ఆధునిక భావ వ్యాప్తిలో చాచా నెహ్రు (బాలల దినోత్సవ శుభాకాంక్షలు)

SMTV Desk 2017-11-14 11:41:42  javaharlal nehru, children s day

హైదరాబాద్, నవంబర్ 14 : కాలం గడిచే కొద్ది చరిత్ర మరుగున పడుతుంది. ఇందులో కొన్ని ప్రయత్నంగా జరిగేవి, కొన్ని స్వాభావింకగాను ఉంటాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో విద్యాపరంగా, ఆర్థికపరంగా ఎంతో దయనీయస్థితిలో ఈ సమాజం వుంది. అంతేకాదు మతపరమైన మూఢనమ్మకాలు, ఆచారాలు ఎన్నో వీటికి తోడై శాస్త్రీయ విజ్ఞానపరంగా వెనుకబడి వున్నాం. దేశప్రధాని జవహర్ లాల్ నెహ్రు, నాటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ దుస్థితిని గమనించారు. నెహ్రు జన్మదినమైన నవంబర్ 14 ను దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా గుర్తించి వారిలో సమిష్టి భావనను, దేశభక్తిని, ఆధునిక విద్య ఆవశ్యకతను పెంపొందించేందుకు ప్రయత్నం జరిగింది. స్వతహాగా చిన్నపిల్లలంటే భావిభారత పౌరులని వారిపైనే దేశభ్యున్నతి ఆధారపడి వున్నదని గుర్తించిన నెహ్రు కు కుమారై ఇందిరా బాలికగా వున్నపుడు తాను జైలు నుంచి రాసిన లేఖలసారం కూడ స్పురణకు వచ్చి వుంటుంది. తన కుమారైకు రాసిన లేఖలలో ఆయన సముద్ర తీరంలోని గులకరాళ్ళను, ఆకాశంలోని మేఘాలను గుర్తించి, వాటిని విశ్లేషించి విజ్ఞానాన్ని పెంపొందిచుకొమ్మని, ఆధునికి విద్యలక్ష్యాలను తెలుసుకొమ్మని ఉద్బోధన వుండేది. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే తన పుస్తకంలో ఆయన ఎన్నో వివరాలు పొందుపరచారు. హిందీభాషలో "చాచా" అంటే పినతండ్రి, అప్పట్లో నెహ్రూను పిల్లలు చాచా నెహ్రు అని సంభోదించేవారట. పలువ్యత్యాసాలతో, ధనిక, పేద తేడాలతో, కులమత భిన్నత్వంతో ఎన్నో భాషల కూర్పుగా వున్న భారతావనిలో అభివృద్దికి విద్యావ్యాప్తి దోహదంచేస్తుందని మన స్వతంత్ర సేనానులు తలిచారు. అందుకే నవంబర్ 14 న పాఠశాలలలో బాలల దినోత్సవం పేరిట ఒక ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించేవారు. విద్యార్ధులు ఆ సెలవు రోజున పాఠశాలకు హాజరై పలు క్రీడలలో పాల్గొనటం, చిత్ర లేఖన, వక్తృత్వ పోటీలలో తమ వాగ్పటిమను పెంపొందించుకొనటం వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. ఇప్పటికి ఆ పద్ధతి దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా గ్రామాలలో బాలబాలికలు కోటుకు ఎర్రగులాబి పెట్టుకుని వుండే చాచా నెహ్రు ఫొటోకు నివాళులర్పించటం చూస్తాం. పాఠశాలలలో ఇది వరలో ACC లాంటి క్రమశిక్షణ సంబంధిత సామాజిక కార్యక్రమాలు ఉండేవి. భారత్ స్కాట్స్ & గైడ్స్ పేరిట అవసరమైన సమయాలలో సమాజానికి సేవచేసే శిక్షణను పాఠశాలలలో నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో నెలకొన్న అనారోగ్యపు ఆచార వ్యవహారాలను అధిగమించి, పురోగతికి బాటవేస్తాయి. దైవభక్తి, మతం వంటి వ్యవహారాలను పాటిస్తూనే, మూఢనమ్మకాలను దూరంగా వుంచటంలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని భావించటం ముదావహం. ఆచరణకు, ఆశయాలకు మధ్యవున్న అంతరాన్ని తెలుసుకుని. జీవితం అర్థవంతంగా గడపటానికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి.