మిషన్ భగీరథ పై కేసీఆర్ సమీక్ష

SMTV Desk 2017-06-11 11:18:19  Mission Bhagiratha,Gajewal constituency,kcr,Civil Supplies,Heat

హైదరాబాద్, జూన్ 11 : ధాన్యం సేకరణకు అవసరమైన నిధులను ఎంత ఖర్చైన బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు రైతులకు సమకూర్చే విధంగా చర్యలు జరపాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయి చరిత్రలో ఎన్నడులేనంతగా ఈసారి పంట పండిందని, దాని ఫలితంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రికార్డు స్థాయిలో ధాన్యం వస్తుందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం గజ్వేల్ నియోజకవర్గ పర్యటనలో మిషన్ భగీరథ పై పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు చెల్లింపుల్లో జ్యాప్యాన్ని నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి రోజు సమీక్షించడంపై శ్రద్ధ వహించాలన్నారు. వర్షాకాలం పంట పనులు ప్రారంభిచేటప్పటికి మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులన్నింటిని పూర్తిచేయాలని, ఇందుకు మంత్రులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. 2017 డిసెంబర్ నాటికి అన్నిగ్రామాలకు నది జలాలు అందేవిధంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జిల్లాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులు సకాలంలో పూర్తయ్యేందుకు ఆయా జిల్లాల మంత్రులు వారి పరిధిలో జరిగే పనులను పర్యవేక్షించాలన్నారు. పౌరసరఫరా శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేనంతగా ఇప్పటి వరకు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని, మరో రెండు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం సేకరణ రైతులకు రూ. 4 వేల కోట్లను చెల్లించినట్లు, మరో వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అనంతరం తన ఫ్రాన్స్ పర్యటన విశేషాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ మెట్రో పాలిటన్ నగరంలో తాగునీటి నిర్వహణ, యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన సీఎంకు తెలిపారు.