కొడ౦గల్ లో ఉపఎన్నిక అనివార్యమా..?

SMTV Desk 2017-11-10 19:09:12   about kodangal by elections, revanth reddy

హైదరాబాద్, నవంబర్ 10 : సరిగ్గా 13 రోజుల క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కోడంగల్ ఎమ్మెల్యే, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని కలిసి తన రాజీనామాను సమర్పించారు. అనంతరం రాహుల్ సమక్షంలో డిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ చెప్తున్నట్టు ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా ఎక్కడుంది? నిజంగా రాజీనామా చేస్తే అది ఇంకా స్పీకర్ కు ఎందుకు చేరలేదు వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రాజీనామాను స్పీకర్ కు పంపకుండా చంద్రబాబు పేచీకి పంపడం ఏమిటని టీ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలివిగా సభ్యత్వాన్ని కోల్పోకుండా ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ ను అనర్హుడిగా ప్రకటించండి అంటూ స్పీకర్ కు టీడీపీ నేతలు ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానం వ్యక్తమవుతోంది. ఒక ప్రక్క ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయింపులను ప్రోతహిస్తూ ఏకంగా 22 మంది ప్రతిపక్ష వైసీపీ ఎమ్మేల్యేలను పార్టీలో చేర్చుకొని, రాజీనామా కోరకుండా రాజ్యాంగ విరుద్దంగా మంత్రి పదవులను సైతం కట్టబెట్టిన టీడీపీ, ఇక్కడ రేవంత్ ను రాజీనామా కోరితే నైతిక ఇబ్బంది తప్పదని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసు ఉన్నందున రేవంత్ విషయంలో మౌనంగా ఉండాలని అధినేత ఆదేశాలు ఉన్నట్లు కొందరు తెలంగాణ నేతలు అనుమానిస్తున్నారు. ఒక ప్రక్క తెలంగాణ స్పీకర్ దగ్గర అధికార టీఆర్ఎస్ లోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మేల్యే ల అనర్హత పిటిషన్ లు పెండింగ్ లోనే ఉన్నాయి. రేవంత్ విషయంలో టీడీపీ నుంచి అటువంటి లేఖ అందితే అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితే. రేవంత్ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఆమోది౦పజేసుకుంటే ఉపఎన్నికలకు వెళ్లి కోడంగల్ ను తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ పావులు కదుపుతుంది. ఇందుకు మంత్రి హరీశ్ కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తుంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికకు వెళ్లి రేవంత్ ఓడిపోతే ఆ ప్రభావం పార్టీ పైన పడుతుందని, కాంగ్రెస్ ఓడిపోయినట్లు అధికార టీఆర్ఎస్ భావిస్తుందని పార్టీ భావిస్తుంది. ఇంతవరకు రాజీనామా తరువాత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారో, రాజీనామా చేసి ఆమోదింపచేసుకొని ఉపఎన్నికకు వెళ్తారో కాలమే సమాధానం చెప్పాలి.