రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..!

SMTV Desk 2017-11-04 17:47:54  Rajadhani, Shatabdi Express, Mobile SMS, Railway Ministry Note

న్యూఢిల్లీ, నవంబర్ 04 : దేశవ్యాప్తంగా రైల్వే శాఖ మొత్తం రాజధాని, శతాబ్ది రైళ్లకు అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై ప్రయాణ సమయం కన్నా గంటకుపైగా రైలు ఆలస్యంగా నడిస్తే, ప్రయాణికులకు ఆ సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో వారి మొబైల్‌ ఫోన్లకు వస్తుంది. ప్రస్తుతం నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి బెర్త్‌ ఖరారైతే ఎస్‌ఎంఎస్‌ వస్తోంది. అయితే నేటి నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. దశల వారీగా ఇతర రైళ్లకు ఈ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని విస్తరిస్తామని అన్నారు. రైలు ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయడం ముఖ్యమని రైల్వేశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సీఆర్‌ఐఎస్‌) భావించింది. దీంతో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని వినియోగించుకోవాలకుంటే ప్రయాణికులు కచ్చితంగా తమ మొబైల్‌ నంబర్‌ను రిజర్వేషన్‌ దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది..