అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించిన హైకోర్టు

SMTV Desk 2017-06-07 17:54:20  illegal structures hnda haicourt, wow 111 is active

హైదరాబాద్, జూన్ 7 : నగర శివార్లలోని హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ సమీప ప్రాంతాలోని జీవో 111 అమల్లో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు జరగడం పై హెచ్ఎండీఏను హైకోర్టు ప్రశ్నించింది. జీవో అమల్లో ఉన్న ప్రాంతాల్లో 40 కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు వెలిశాయంటే ఇది నిబంధనలను హోల్ సేల్ గా ఉల్లంఘించడమేనని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ టీ రజనిలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా హెచ్ఎండీఏ చోద్యం చూస్తున్నట్టు మౌనంగా ఉన్నదని విమర్శించింది. జీవో 111 అమల్లో ఉన్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటవుతున్నా ప్రభుత్వ చర్యలు చేపట్టడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది. అక్రమ నిర్మాణాల వివరాలను పిటిషన్ తరపున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కోర్టు కు నివేదించారు. హెచ్ఎండీఏ తరపున న్యాయవాది వై. రామారావు వాదిస్తూ, జీవో 111 చట్టబద్దతపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో శాస్రీయ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని కోర్టు కు తెలిపారు. అక్కడి 84 గ్రామాల పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ భవనలున్నాయన్నారు. ఆ కాలేజీల జాబితాను పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, గతంలో తాను న్యాయవాదిగా ఉన్నప్పుడు జాబితాలో ఉన్న కొన్ని కాలేజీల కేసులు వాదించినందు వల్ల ఈ కేసును విచారించడం సరికాదని వ వెల్లడించారు. వ్యాజ్యం విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.