జీఎస్టీతో పేరుతో అక్రమ వసూళ్లు....నగరంలో జీఎస్టీ దందా....

SMTV Desk 2017-10-17 11:37:01  GST, Hyderabad, officers

హైదరాబాద్, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలు అక్రమ వసూళ్లు దందాకు తెర లేపారు. జీ ఎస్టీ నిబంధనలకు వ్యతిరేకంగా తనిఖీలా పేరుతో కొందరు అధికారులు వ్యాపారులను నిలువునా దోచేస్తున్నారు. పండుగ సందడిని ఆసరాగా తీసుకుని ఉన్నతాధికారుల ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల సమయంలో భారీగా అమ్మకాలు జరిగే అవకాశం ఉండడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు జారీ చేసి మరీ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులే తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో ఇటీవల కొందరు అధికారులు, ఉద్యోగులు జీ ఎస్టీకి ముందు నాటి వ్యాట్‌ వ్యవహారాలు.. సర్దుబాట్ల పేరుతో ఈ వసూళ్లకు తెగబడుతుండడం వ్యాపారవర్గాల్లో ఆందోళనకు దారితీస్తోంది. నెల రోజులుగా హైదరాబాద్‌ సహా పలు ప్రధాన పట్టణాల్లో ఈ తంతు కొనసాగుతోంది. కాగా, జీ ఎస్టీ చట్టం ప్రకారం వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు చేయడానికి వీలు లేదు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే గుర్తించి.. సరైన ఆధారాలు ఉంటే ధ్రువీకరించుకుని ప్రాథమిక సమాచార నివేదిక ఉన్నతాధికారులకు పంపాలి. ఈ ప్రక్రియ అనంతరం ఉన్నతాధికారుల అనుమతి ఇస్తే తర్వాత విచారణ చేపట్టాలి. ఆడిట్‌లో ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే వాటిపై వివరణ కోరి అప్పటికి సంతృప్తి చెందక పోతేనే అప్పుడు పార సంస్థకు అధికారులు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అధికారులు అక్రమ వసూళ్లకు తెగబడడం గమనార్హం.