చదువుల ఒత్తిడితో విద్యార్ధిని అదృశ్యం....

SMTV Desk 2017-10-16 14:08:42  NARAYANA COLLEGE, GOVARIKANI, HYDERABAD,

హైదరాబాద్, అక్టోబర్ 16 : ప్రస్తుత కాలమానంలో విద్యాసంస్థలు, తల్లిదండ్రులు విద్యార్ధుల పైన చదువే ప్రధానమంటూ ఎంతో మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో సాయి ప్రజ్వల అనే విద్యార్ధి తాను చదువుతున్న కళాశాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ...తల్లిదండ్రులకు లేఖ వ్రాసి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన విద్యాగిరి శ్రీనివాస్‌ వృత్తిరీత్యా కార్పెంటర్‌. అతని కుమార్తె సాయి ప్రజ్వల(17) ఇంటర్ పూర్తి చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాద్ లోని బండ్లగూడ నారాయణ కళాశాలలో చేరి ఆ కళాశాల వసతి గృహంలోనే ఉంటుంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన ప్రజ్వల ఈ నెల 10న వసతి గృహానికి తిరిగి వచ్చింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆమెను పిలిచి మందలించారు. దాంతో ప్రజ్వల నాకు చదువుకోవడం ఇష్టం లేదని, నేను ఇంటికి తిరిగి వెళ్తానని మొండికి వేసింది. ఆ వసతి గృహం యాజమాన్యం అమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు సాయి ప్రజ్వల తండ్రి హైదరాబాద్ చెంగిచర్ల లో నివాసము౦టున్న ఆమె మేనమామకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లమని కోరగా, అతను ఇంటికి తీసుకువచ్చాడు. మరుసటి రోజు గోదావరిఖనికి పంపాల్సి ఉంది. కాని ఆమె తల్లిదండ్రులకు లేఖ రాసి పెట్టి కనిపించకుండా వెళ్ళిపోయింది. దీంతో సాయి ప్రజ్వల తండ్రి చుట్టు ప్రక్కల ఎంత వెతికినా కనపడక పోవడంతో మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను గమనించగా ఆ రోజు ఉదయం ఆమె ఒంటరిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం గమనించారు. కాని ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు. ఆ లేఖలో నారాయణ కళాశాల వేస్ట్ అని అక్కడి సమస్యల వల్లే విద్యార్ధులు బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారని వ్రాసింది. కుమార్తె కోసం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.