ఆన్ లైన్ షాపుకు.. ఆఫ్ లైన్ మోసగాడు...

SMTV Desk 2017-10-11 16:19:25  Online Store Amazon, police, shivam chopra

న్యూఢిల్లీ,అక్టోబర్ 11 : ప్రస్తుతం నడుస్తున్న బిజీ జీవితాలల్లో చాలామంది తాము కూర్చొన్న చోటు నుంచే తమకు అవసరమైన వస్తువులను ఆన్ లైన్ షాపుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు వేరే వస్తువులు, ఖాళీ బాక్స్ లు కూడా వస్తాయి. అలాంటప్పుడు కస్టమర్లు ఆన్ లైన్ స్టోర్ లకు ఫిర్యాదులు చేయగా వారు రీఫండ్ చెల్లిస్తారు. అయితే ఈ సదుపాయాన్ని అవకాశంగా తీసుకొని ఓ యువకుడు ఆన్ లైన్ స్టోర్ అమెజాన్ ను బురిడీ కొట్టించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కు చెందిన 21 ఏళ్ల శివం చోప్రా హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఒక్కదా౦ట్లోనూ నిలబడక మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ ఆర్డర్ల ఐడియా వచ్చింది. మొదట తను రెండు ఫోన్లు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. అవి వచ్చినప్పటికీ ఖాళీ బాక్స్ లు వచ్చాయని అమెజాన్ కు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ సంస్థ ఇతనికి రీఫండ్ చెల్లించింది. ఈ పద్దతి ఫలించడంతో శివం వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి 166 సార్లు ఇదే విధంగా చేసి, ఎంతో ఖరీదైన బ్రాండ్ల ఫోన్లను కూడా స్వాహా చేశాడు. అయితే, స్థానిక టెలికాం స్టోర్ యజమాని సచిన్, శివం కు 141 సిమ్ కార్డులను ఒక్కో దాన్ని రూ.150 కి విక్రయించాడు. ఈ సంఘటనలపై అనుమానం వచ్చిన అమెజాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో నెలల పాటు కేసును దర్యాప్తు చేసి ఎట్టకేలకు శివం, సచిన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్డర్ ద్వారా వచ్చిన ఫోన్లను శివం రీటైల్ మార్కెట్లో విక్రయించేవాడని పోలీసులు పేర్కొన్నారు.