తెలంగాణ చారిత్రక వైభవాన్ని వెలికి తీసేందుకు తవ్వకాలు

SMTV Desk 2017-06-06 17:36:59  ts state history, kotilingala, karnamamidi, archaeology

హైదరాబాద్, జూన్ 6 : పురాతన కాలంలో ఉన్న 16 మహాజనపదాల్లో ఒకటైన తెలంగాణాకు అపూర్వమైన చరిత్ర, సాంస్కృతి ఉందనేది వెలుగుచూసిన వాస్తవం.అయితే మరింత స్పష్టమైన రీతిలో తెలంగాణా చారిత్రక వైభవాన్ని తెలుసుకునేందుకు పురావస్తుశాఖ అన్వేషణలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రాచీన నాగరికత నుండి ఆధునిక నాగరికత వరకు ఉజ్వలమైన చరిత్ర తెలంగాణా సొంతమని భావిస్తున్నారు. అదే క్రమంలో తవ్వకాల ద్వారా మరింతస్పష్టంగా తెలుసుకునేందుకు పురావస్తుశాఖ కార్యచరణను ప్రారంభించింది. శాతవాహనుల తొలి రాజధాని నగరంగా భాసిల్లిన కోటిలింగాలకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా కర్ణమామిడి లో తవ్వకాలు నిర్వహించడం ప్రారంభించారు. గోదావరి నది పాయ మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో 45 రోజుల పాటు తవ్వకాలు జరిపేందుకు నిర్ణయించింది.పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాక్షి సహా అధికారుల నేతృ త్వంలో తవ్వకాలు జరుగుతున్నాయి. గోదావరి నదికి దక్షిణాన వెల్గటూరు మండలం పరిధిలో ఉన్న కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని అని చరిత్ర చెబుతోంది. అక్కడ వంద ఎకరాల విస్తీర్ణంలో మహానగరం విలసిల్లిందని, ప్రస్తుతం అది మట్టిపొరల్లో నిక్షిప్తమైందని 40 ఏళ్ళ కింద గుర్తించారు. ఆ స్థలాన్ని సేకరించి మట్టిలో కూరుకుపోయిన నగర ఆనవాళ్ళను వెలుగులోకి తేవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో నదికి ఉత్తరాన ఉన్న కర్ణమామిడిలో భూ ఉపరితలంలోనే చారిత్రక అవశేషాలు కనిపిస్తున్నాయి. అది శాతవాహనుల కంటే ముందు కాలానికి సంబంధించిం దై ఉంటుందనే వాదన ఉంది. అక్కడ తవ్వకాలు జరిపి శాస్త్రీయ పద్దతిలో వివరాలు సేకరిస్తేనే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో మునిగిపోయింది. నీటి నిల్వతగ్గటంతో బయటపడ్డ కొంతమేర భూమిలో ఇప్పుడు తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. గతేడాదే సెంట్రల్ అడ్వెజరీ బోర్డు ఆఫ్ ఆర్కియాలజీ అనుమతించినా నీటి ముంపువల్ల పనులు ఆలస్యం అయ్యాయి. కేంద్రం ఇచ్చిన అనుమతి గడువు ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఉంది. ఈ పనులను పుణేలోని డెక్కన్ కాలేజ్ నిపుణులు కూడా పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి కీలక అన్వేషణ జరిపిన అనుభవం లేనందున కొందరు విదేశీ నిపుణుల సాయం కూడా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. 25 గజాల ప్రాంతాన్ని ఒక ట్రెంచు గా మార్క్ చేసి తవ్వకాలు జరుపుతారు. ఇలాంటి 25 ట్రెంచులను ఒక సెక్టార్ గా కొలతలు వేశారు.