నకిలీ నిఖాలకు నిలయంగా పాత బస్తీ..ఇంతకీ ఏం జరిగింది..?

SMTV Desk 2017-09-21 13:17:27  hyderabad, pathabasti, arab sheikh,

హైదరాబాద్, సెప్టెంబర్ 21: పెళ్లంటే నూరేళ్ళపంట అని భావిస్తారు. కానీ ఇక్కడ పాత బస్తీలో పెళ్లంటే పేకముక్కలాట.. నిఖా అంటే నిండుగా ముంచేయడం.. అరబ్ షేక్ లను పెళ్లాడడం, పరాయి దేశ౦లో నరక యాతన అనుభవించడం వీరికి అలవాటుగా మారిపోయింది. నకిలీ నిఖాలకు నిలయంగా మారిపోయిన పాతబస్తీలోని పేద ముస్లిం బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, సూడాన్‌, ఒమన్‌, సోమాలియా, దుబాయ్‌ తదితర దేశాలకు చెందిన కొందరు షేక్‌లు నిఖా పేరిట నకిలీ పెళ్లిళ్లు చేసుకొని, లాడ్జి లు, కిరాయి రూమ్ లలో కాపురం పెట్టి మోజు తీరాక, వారి వీసా గడువు ముగిసాక తలాక్ చెప్పి వెళ్లిపోతున్నారు. పేదరిక సమస్యలతో ఉన్న యువతులు ఈ అరబ్ షేక్ లకు సమిధలుగా మారుతున్నారు. ఈ ముసుగు వేసుకున్న దుబాయ్ షేక్ లు నిఖా పేరుతో నిరు పేద కుటుంబాలకు, పెళ్లాడిన యువతులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. పాతబస్తీకి చెందిన రుబినాకు రెండేళ్ల కిందట 76 ఏళ్ల షేక్‌తో పెళ్లయింది. అరబ్‌ దేశానికెళ్లాక... అతను అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్టు తెలిసింది. దీంతో ఆ ఇంటివారు ఆమెను చిత్రహింసలు పెట్టి, లైంగిక దాడులకు పాల్పడి, చివరికి పని మనిషిగా మార్చేశారు. ఆమె ఆత్మహత్యకు సిద్దపడింది దీంతో వారు భయపడి రుబినాను హైదరాబాద్ కు పంపేశారు. షాహీన్‌నగర్‌కు చెందిన మున్నీరా(19)ది మరో కథ, మారు తండ్రి డబ్బులకు ఆశపడి ఒమన్‌కు చెందిన 83 ఏళ్ల కురువృద్ధుడికిచ్చి మున్నీరాకు పెళ్లి చేశాడు. ఆరు నెలలు స్థానిక హోటల్ లో కాపురం చేశాడు.. వీసా గడువు పూర్తయ్యాక వదిలి వెళ్ళిపోయాడు. అప్పటికే మున్నిరా 3 నెలల గర్భావతి కావడంతో కన్నీరు మున్నిరుగా విలపించింది. అదేవిధంగా ఫలక్‌నుమా ఠాణా పరిధిలో 16 ఏళ్ల రౌక్సర్‌ ఉదంతం మరీ ఘోరం! ఒమన్‌కు చెందిన 68 ఏళ్ల షేక్‌ అహ్మద్‌ ఆమెను పెళ్లా డి తనతో తీసుకెళ్లాడు. అ ఇంట్లో నరకం భరించలేక తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ తీసుకెళ్లి పోవాలని మొర పెట్టుకుంది రౌక్సర్‌. కానీ తన తల్లిదండ్రులకు అంత స్థోమత లేదు బిడ్డను తెచ్చుకునేందుకు, వీరి పేదరికాన్ని ఆసరాగా తీసుకొని సొంత బంధువులే బ్రోకర్ లుగా మారి ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అరబ్ షేక్ ల చెర నుంచి బాలికలను కాపాడి వారిపై తగు చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.