రహదారి ప్రమాదాలపై స్పందిద్దాం..మానవత్వాన్ని చాటుకుందాం..!

SMTV Desk 2017-09-19 14:51:18  hyderabad, Road accidents,

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఇటీవల నగరాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రమాదాలు ఎక్కువగా మలుపుల వద్ద చోటు చేసుకుంటున్నాయి. సంఘటన స్థలంలో ప్రమాదానికి గురైన క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉన్నా, అక్కడ రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులు, ప్రజలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు.సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోనేసరికి ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడం, వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల మేడ్చల్ పోలిస్ ఠాణా పరిధిలో రహదారిపై కడకోండ్ల వద్ద ఆదివారం ఉదయం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం 35 ఏళ్ల యువకుడిని డీకొట్టి వెళ్లింది. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అక్కడి ప్రజలు పట్టించుకోకపోగా కొన్ని వాహనాలు మృతదేహంపై నుంచే వెళ్ళాయి. ఇలాంటి సంఘటనలు నానాటికి పెరుగుతున్నా ప్రజల్లో స్పందన కరువైంది. రహదారుల ప్రమాదాల పట్ల స్పందిస్తే.. పోలీసులు ఎక్కడ తమ సమయాన్ని వృథా చేసి తమ చుట్టూ తిప్పుకుంటా రేమో అన్న భయ౦, కోర్టులకు వెళ్ళాలన్న భావన, ప్రజలను ఈ సమస్యపై స్పందించడానికి వెనుకడుగు వేసేలా చేస్తుంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏటంటే... సంఘటన స్థలంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్పించిన వారిని కులం, మతం, చిరునామా, ఫోన్ న౦బర్లు అడగకూడదు. వారిపై ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడి తీసుకురాకూడదు. వారి వివరాలను ఎఫ్.ఐ.ఆర్ లో లేదా జీడీ ఎంట్రీ పుస్తకంలో నమోదు చేయకూడదు. తాము సాక్షులుగా ఉంటామంటేనే వారికి రక్షణ కల్పించి, అప్పుడు అఫిడవిట్ లో పోలీసులు వారి పేర్లు రాయాలి. ఇప్పటికైనా ఈ ఆదేశాలను వాహనదారులు గమనించి బాధితుల పట్ల సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై సైదాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ... నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. రహదారుల పై వెళ్ళే వాహన చోదకులు, ప్రజలు ముందుగా వారికి సహాయమందించండని, ఘటన స్థలానికి మేం చేరుకునే సరికి క్షతగాత్రుల పరిస్థితి క్షీణి౦చే ప్రమాదం ఉందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ పోలిస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి స్పందిస్తూ... “క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించిన వారిని సాక్షులుగా చేర్చబోమని చెప్పారు. వారిచ్చిన సమాచారంతో వేగంగా స్పందించి తదుపరి చర్యలు చేపడతామని గాయపడ్డవారికి ముందుగా వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని వెల్లడించారు.