ఇంకా ఎన్నాళ్ళీ కుక్క కాట్లు...

SMTV Desk 2017-09-18 14:12:25   Seemingly dogs, ghmc, Contraceptive operations, Hyderabad

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాజధాని నగరంలో రోజురోజుకీ వీధి కుక్కల బెడద పెరుగుతూ వస్తోంది. వీధుల్లో నడవాలంటే కుక్కలు ఎక్కడ వెంటపడతాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ వీధిలోచూసినా వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ తరచూ ప్రజలపై దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులలో స్పందన కనిపించడం లేదు. తరచూ రన్నింగ్‌ బైకుల ముందుకు ఆకస్మాత్తుగా అడ్డం వస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడి తీవ్రంగా గాయల పాలవుతున్నారు. రాత్రిపూట కాలినడకన ఎక్కడికైనా వెళ్ళాలంటే వీధికుక్కలకు భయపడి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా నగరపాలక సంస్థ ఈ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మహానగరపాలక సంస్థ ఎలాంటి చర్యలకు ఉపక్రమించటంలేదా..? ఈ సమస్య నిర్మూలణకు జీహెచ్ఎంసీ నివారణ చర్యలను చేపట్టినా అవి సంపూర్ణ ఫలితాలను సాధించడంలో విఫలమవుతున్నాయి. దీనికి సరైన ఉదాహరణకు పది కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేసేలోపున అంతకు ఎన్నో రెట్లు సంతానోత్పత్తి జరగడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో సంవత్సరానికి దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నా.. జనానికి కుక్క కాట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కుక్కల బెడదను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రేబీస్‌ వ్యాక్సిన్‌ సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ విన్నవిస్తున్నారు.