“అభయహస్తం” ఎక్కడ..?

SMTV Desk 2017-09-17 16:15:36  ABHAYA HASTHAM, ASARA PENSIONS, KCR, 1000 RUPESS PENSIONS.

హైదరాబాద్, సెప్టెంబర్ 17 : వైఎస్ఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమార్ధం అభయహస్తం అనే పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ పైబడిన వారికి ఆర్ధిక చేయూతను అందించడమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన ఈ పథకం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరుగున పడిపోయింది. అయితే ఈ పథకానికి కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం వృద్దుల సంక్షేమార్ధం "ఆసరా" పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రస్తుతం 58 సంవత్సరాలకు పైబడిన వృద్దులకు నెలకు 1000 రూపాయలు ఫించన్ అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ అభయహస్తం పథకాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి కారణాలు సైతం లేకపోలేదు.. 2014 లో 2.30 లక్షల మంది 60 ఏళ్ళ పైబడిన వారు ఉండడంతో వారికి నెలవారీ రూ. 500 చొప్పున ఫించన్ ఇచ్చారు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో నెలకు రూ.1000 చొప్పున ఫించన్ ఇచ్చే "ఆసరా" పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అభయహస్త౦ పథకంలోని కొంతమంది ఆసరా పథకంలోకి వెళ్ళారు. "ఆసరా"కు అర్హతలు లేని 1.13 లక్షల మంది మాత్రం అభయహస్తంలోనే ఉండిపోయారు. వీరికి నెలవారీ రూ. 500 చెల్లింపులో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కాగా గత 8 నెలల నుండి ఫించన్ బకాయిలు పెరుకపోవడంతో మహిళలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వీరిని ఆదుకోవడానికి గ్రామీణాభివృద్ది శాఖ అభయహస్తం ఫించన్ దారులకు బ్యాంకుల్లో ఖాతాలను తెరిచి వారికి కాస్త ఊరటనిచ్చింది. ఇకపై విడుదల చేసే ఫించన్లు, బీమా మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.