సీఎం నాటిన మొక్కకే పరిరక్షణ కరువైతే ఎలా..?

SMTV Desk 2017-09-17 15:06:35  haritha haram, kcr, maner kcrplant, kcr haritha haram

హైదరాబాద్ సెప్టెంబర్ 17: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం అనేక సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ‘హరిత తెలంగాణ’ గా మార్చాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరిత హారం’ కార్యక్రమాన్ని 2015 జులై మాసంలో ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలనే భారీ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 2015 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. 2016 లో వర్షాలు సంవృద్దిగా కురిచినా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడంలో మాత్రం ప్రభుత్వం విఫలమయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రణాళికలో ఉన్న ధృడ సంకల్పం అచారణలో లేకపోవడం వల్లే ఈ కార్యక్రమం నీరుగారిపోయే పరిస్థితి దాపురించినదని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరితహారం మూడో విడతలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ మానేరు డ్యాం తీరంలో ‘మహాఘని’ మొక్కను నాటారు. అయితే దానికి పరిరక్షణ కరువవ్వడంతో కొన్ని రోజులకు వాడిపోయింది. ఈ ఉదాహరనే ఈ కార్యక్రమం నీరుగారిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏకంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కకే సంరక్షణ కరువైతే..మరి మిగతా మొక్కల పరిస్థితి ఏంటి..? ఇక్కడ లోపం ప్రభుత్వానిదా..? అధికారులదా..? నాయకులు నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదే. అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యమే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు నీరుగారడానికి ప్రత్యక్ష నిదర్శనగా నిలుస్తున్నాయని తెలుస్తుంది. ప్రజా ప్రయోజనార్థం సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఏ విధంగా ఉందో, ఆ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా అధికారులకు అంతే ఉందని అధికారులు గ్రహించగలిగితే సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.