చర్లపల్లి గ్యాస్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

SMTV Desk 2017-09-15 11:41:09  hyderabad, cherlapally , gas cylinders blast in charlapally

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ప్లాంటులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్లలో ఎల్‌పీజీ గ్యాస్‌ నింపుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ప్లాంటులో 200 మందికి పైగా కార్మికులు ఉన్నట్టు సమాచారం. షిఫ్ట్ పద్ధతుల్లో ప్లాంటులో 24 గంటలు సిలిండర్లలో గ్యాస్ ఫిల్లింగ్ పనులు జరుగుతుంటాయి. అయితే వారం రోజుల నుంచి సిలిండర్లలో గ్యాస్‌ నింపుతున్న సమయంలో పైపులు పగిలి నిప్పురవ్వలు వస్తున్నట్లు కార్మికులు గుర్తించారు. అలా పగిలిన పైపులైన్లకు వెల్డింగ్ మరమ్మత్తులు పని కొనసాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి యథావిధిగా సిలిండర్లులో గ్యాస్ నింపుతున్న సమయంలో నిప్పురవ్వలు వచ్చి, మంటలు చెలరేగాయి. చిన్న మంటగా ఉన్నప్పుడే కార్మికులు గుర్తించి బయటికి పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే వరుసగా సిలిండర్లు పేలడం మొదలైంది. అయితే వెంటనే అందులో పనిచేసే కార్మికులు, కంపెనీ చుట్టుపక్కల నివసించే ప్రజలు దూరంగా పరుగులు తీయడం వలన భారి ప్రమాదం నుండి బయటపడగలిగారు. ప్రమాదం విషయం తెలిసిన రాచకొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. సిలిండర్లు పేలే సమయంలో ప్లాంటు లోపల కార్మికులు ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదని రాచకొండ పోలీసులు వెల్లడించారు.