అగస్టా వెస్ట్‌‌లాండ్‌‌ స్కామ్‌‌లో మరో ట్విస్ట్

SMTV Desk 2019-08-01 15:18:56  Agasta Westland scam

అగస్టా వెస్ట్‌‌లాండ్‌‌ స్కామ్‌‌లో హైదరాబాద్‌‌ కంపెనీ ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్‌‌కు లింక్‌‌ ఉన్నట్లు బయటపడింది. ఈ నెల 24 న ఆల్ఫాజియో ఆఫీసుపై జరిగిన రైడ్స్‌‌లో సాక్ష్యాధారాలు దొరికినట్లు ఇన్‌‌కంటాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించింది. ఆయిల్‌‌ అండ్‌‌ గాస్‌‌ రంగానికి అవసరమైన సీస్మిక్‌‌ డేటా ఎనాలిసిస్‌‌ కార్యకలాపాలను ఆల్ఫాజియో నిర్వహిస్తోంది. ఐటీ దాడులలో దాచిపెట్టిన నాలుగు బ్యాంకు అకౌంట్లు, పన్నుల ఎగవేతకు అనుకూలమైన దేశాలలో రహస్యంగా పెట్టిన మూడు కంపెనీలు, వివరాలులేని రూ. 45 లక్షల కాష్‌‌, రూ. 3.1 కోట్ల నగలు ఈ దాడులలో కనుగొన్నట్లు ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ తెలిపింది. ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్‌‌ను ఆళ్ల దినేష్‌‌ 1987 లో నెలకొల్పారు. దిగుమతులలో భారీగా ఓవర్‌‌ ఇన్వాయిసింగ్‌‌కు ఆల్ఫాజియో పాల్పడినట్లు ఇన్‌‌కంటాక్స్‌‌ పరిశోధనలో తేల్చారు. రూ.3,600 కోట్ల వీవీఐపీ చాపర్‌‌ స్కామ్‌‌లో ప్రధాన సూత్రధారి, దుబాయ్‌‌ వ్యాపారి రాజీవ్‌‌ సక్సేనా ద్వారా ఈ ఓవర్‌‌ ఇన్వాయిసింగ్‌‌కు కంపెనీ పాల్పడిందని వెల్లడైంది. ఇలా ఓవర్‌‌ ఇన్వాయిసింగ్‌‌ చేయడం వల్ల రూ. 41 కోట్ల అదనపు డబ్బు కంపెనీకి సమకూరిందని, ఆ మొత్తాన్ని దుబాయ్‌‌లోనే అట్టేపెట్టారని కూడా ఇన్‌‌కంటాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ తేల్చింది. దర్యాప్తులో ఓవర్‌‌ ఇన్వాయిసింగ్‌‌కు సంబంధించి – రాజీవ్‌‌ సక్సేనా, ఆళ్ల దినేష్‌‌ ల మధ్య జరిగిన మొబైల్‌‌ సంభాషణలు, ఈమెయిల్స్‌‌ ఇతర ఆధారాలు లభించాయని ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ తెలిపింది. అన్ని వివరాలను ముందు పెట్టడంతో తప్పు చేశానని ఆల్ఫాజియో మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ ఆళ్ల దినేష్‌‌ ఒప్పుకున్నట్లు పేర్కొంది. స్విట్జర్లాండ్‌‌ యూబీఎస్‌‌ బ్యాంకు, సింగపూర్‌‌ ఓసీబీసీ బ్యాంకు, యూఎస్‌‌ సిటిజెన్స్‌‌ బ్యాంకు, కరేబియన్‌‌ ఐలాండ్స్‌‌ (సెయింట్‌‌ కిట్స్ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ నెవిస్‌‌ ఇంటర్నేషనల్‌‌)లో రహస్య అకౌంట్లు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. బ్రిటిష్‌‌ వర్జిన్‌‌ ఐలాండ్స్‌‌, ఐలాండ్‌‌ ఆఫ్ నెవిస్, సింగపూర్‌‌లలో రహస్యంగా పెట్టిన కంపెనీల వివరాలూ బయటకు వచ్చాయి.