వైసీపీలో చేరుతారన్న రూమర్ పై స్పందించిన ప్రత్తిపాటి

SMTV Desk 2019-05-28 16:53:08  Prathipati pulla rao,

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్తూన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు పేరు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన వైసీపీలో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉదయం ఆయన స్పందించారు. ఈ ఉదయం గుంటూరులో మాట్లాడిన ఆయన, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, నిరాధారమని స్పష్టం చేశారు.

తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం, ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. టీడీపీ ఓడిందంటే ఎవరూ నమ్మలేక పోతున్నామని బ్యాలెట్ విధానం కోసం ఇప్పటి నుంచే పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు.