ఉపాధిహామీ పనుల్లో విషాదం...పది మంది మహిళా కూలీలు మృతి

SMTV Desk 2019-04-10 16:05:48  100 days work, narayanapeta,

నారాయణపేట: నారాయణ పేట జిల్లాలో ఉపాధిహామీ పనుల్లో దారుణం చోటు చేసుకుంది. మరికల్ మండలం పీలేరులో ఉపాధిహామీ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడడంతో పది మంది కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మట్టిదిబ్బ తవ్వుకుంటూ పన్నెండు మంది కూలీలు లోపలికి వెళ్లారు. అదే సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడడంతో పదిమంది కూలీలు మృతిచెందారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు పీలేరుకు చెందిన పి. అనురాధ(30), బీమమ్మ(40), బుడ్డమ్మ(26), బి.లక్ష్మి(28),కె. లక్ష్మి(30), మంగమ్మ(32), అనంతమ్మ(45), కేశమ్మ(38),బి. అనంతమ్మ(35)లుగా గుర్తించారు. మృతి చెందిన వారంతా మహిళలే కావడం గమనార్హం. గాయపడిన లక్ష్మి అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సిఎం కెసిఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలను ఆదుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులకు సూచించారు.