హైదరాబాద్ లోని నివాసాలకు ధరలు తక్కువే!

SMTV Desk 2019-04-04 18:29:59  hyderabad, house marketing, real estates, property consultancy jll india

హైదరాబాద్ : ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవడం అంటే బడా బడా వ్యక్తులే తప్ప సామాన్య ప్రజలకు ఓ కలలాగే ఉండేది. హైదరాబాద్ నగరం అంటే ఒకప్పుడు ధనవంతులకు అడ్డా. ఓ ఇల్లు కొనాలన్నా.. కొంత జాగ కొందామన్నా ఖరీదెక్కువ. లక్షలు, కోట్లలో కొనుగోలు వ్యవహారం ఉండేది. కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతాయి. అలాగే ఇప్పుడు భాగ్యనగరంలో గృహ కొనుగోల్లు అన్ని వర్గాలకు చేరువయ్యాయి. ఇండ్ల ధరలు చౌకగా మారాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తాజా వివరాల ప్రకారం.. భారత్ లో అత్యంత చౌక హౌజింగ్‌ మార్కెట్ హైదరాబాదేనని తేలింది. ఆ సంస్థ గతేడాదికిగాను హోం పర్చేజ్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ను బుధవారం ఆవిష్కరించింది. జేఎల్‌ఎల్‌ ఇండియా సర్వేలో.. దేశంలోని ఆరు ప్రధాన నగరాలను దాటేసి హైదరాబాద్ మహానగరం మొదటి స్థానంలో నిలిచింది.జేఎల్‌ఎల్‌ ఇండియా సంస్థ.. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రియల్ ఎస్టేట్‌పై సర్వే జరిపింది. ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌, కోల్‌ కతా నగరాలలో జరిపిన అధ్యయనంలో.. స్థిరమైన ధరలు, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు.. దేశంలోని ప్రధాన నగరాలలో హౌజింగ్ మార్కెట్ ను చౌకగా మార్చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇండ్లు అన్ని వర్గాలకు చేరవయ్యాయని తేలింది. గృహరుణ వడ్డీ రేట్లు, గృహస్తుల సగటు ఆదాయం, అపార్టుమెంటులో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ధర ఆధారంగా జేఎల్‌ఎల్‌ ఇండియా ఈ తాజా సర్వేను చేసింది. గృహరుణ వడ్డీ రేటు, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం నగరంలో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ తీసుకోవడానికి అర్హులు, అనువైన వార్షిక ఆదాయం ప్రామాణికంగా ఆయా నగరాలకు ర్యాంకులను కేటాయించింది. 2011 నుంచి 2018 వరకు ఏడేండ్ల వ్యవధిపై హెచ్‌పీఏఐని జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసింది. ఇందులో చౌక గృహ విపణిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం కోల్‌ కతాకు దక్కింది. పుణె మూడో స్థానంలో నిలిచింది. కాగా తమ హోం పర్చేజ్‌ అఫర్డబిలిటీ ఇండెక్స్ ను ముంబై అందుకోలేకపోయిందని.. ముంబైలో ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈవో, దేశీయ అధిపతి రమేశ్ నాయర్ అన్నారు.