ఏడాది దాటినా కొలిక్కి రాని వివాదం..

SMTV Desk 2017-08-13 16:13:43  school teachers, principals, teaching issue, maths subject

హైదరాబాద్, ఆగస్ట్ 13 : 2017-18 విద్యా సంవత్సరం స్కూళ్లు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల మధ్య వివాదం ఇంకా రగులుతూనే ఉంది. 6,7 తరగతుల బోధన బాధ్యతను మ్యాథ్స్‌ టీచర్లకే అప్పగించాలని ఫిజికల్‌ సైన్స్‌ టీచర్లు విద్యాశాఖకు విజ్ఞప్తి చేయడంతో పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ.. 7వ తరగతి మ్యాథ్స్‌ను గణితం స్కూల్‌ అసిస్టెంట్లు, 6వ తరగతికి ఫిజికల్‌ సైన్స్‌ టీచర్లు లెక్కలు బోధించాలని పేర్కొన్నారు. దీంతో మ్యాథ్స్‌ టీచర్లు విద్యాశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ కమిషనర్‌ తన ఆదేశాలను పెండింగ్‌లో పెట్టడమే కాక, అసలు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో చాలా జిల్లాల్లో గణితం సబ్జెక్టు బోధన తమది కాదంటే తమది కాదంటూ టీచర్లు తప్పించుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల ఎవరో ఒకరు అయిష్టంగానే బోధిస్తున్నా, అర్ధంకాని విద్యార్థులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విద్యా స౦వత్సరానికి పని దినాలు తగ్గే అవకాశం ఉండడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ 12తో ఈ విద్యా సంవత్సర౦ ముగించాలని నిర్ణయించడం, 6,7 తరగతులకు గణితం ఎవరు బోధించాలనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోవటమే వారి ఆందోళనకు కారణంగా తెలుస్తోంది. విద్యా సంవత్సరం ముందుగానే ముగిస్తే రెండు వారాలు పని దినాలు తగ్గే అవకాశం ఉంది. దీంతో సిలబస్ ఎలా పూర్తి చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.