వివాహేతర సంబంధం: పక్కా ప్లాన్ వేసి హత్య

SMTV Desk 2019-03-23 19:13:15  Hyderabad, Murder, Illegal,

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని దివ్యాంగుడైన భర్తను ఒక భార్య దారుణంగా చంపిన ఘటన నగరంలోని ఎల్బీనగర్‌లో జరిగింది. ఎల్‌బీనగర్ ఎస్బీఐకాలనీలో 40 ఏళ్ల పులికాశయ్య, 30 ఏళ్ల నాగలక్ష్మీ కలిసి ఉంటున్నారు. అయితే భార్య నాగలక్ష్మికి, 25 ఏళ్ల సైదులుతో వివాహేతర సంబంధము ఏర్పడింది. ఇందుకు భర్త అడ్డుపడుతున్నాడని పక్కా ప్లాన్ వేసి హత్య చేశారు. కాశయ్య సైదులను పలుమార్లు వారించాడు. తరచూ భార్య, సైదులుతో కాశయ్య గొడవపడేవాడు.

ఈ నెల 14వ తేదీన సైదులు మద్యం సీసాను నాగలక్ష్మికి ఇచ్చి కాశయ్యకు తాగించమని చెప్పాడు. 16వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు సైదులు, నాగలక్ష్మితో కాశయ్య గొడవకు దిగాడు. నాగలక్ష్మి సైగ చేయడంతో సైదులు కాశయ్య గొంతు నులిమాడు. ఆమె గదిలో నుంచి స్కిప్పింగ్‌ తాడు తీసుకొచ్చి ఇద్దరూ కలిసి అతడి మెడకు బిగించారు.

అతడు చనిపోయిన తర్వాత చీరను గదిపై కప్పు కొక్కేనికి కట్టి కాశయ్య మెడకు చీర బిగించి వేలాడదీశారు. ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. సైదులు అక్కడి నుంచి పారిపోయాడు. హతుడి సోదరుడు సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహేతర సంబంధం హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. సైదులు, నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.