రేణుకా చౌదరి vs నామా

SMTV Desk 2019-03-23 13:50:42  renuka choudary , nama,

తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న విషయమై తర్జనభర్జన పడిన కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరికి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరివైపే మొగ్గుచూపింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 16 స్థానాలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థుల పేర్లను రెండు విడతలుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి రేణుకా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త రవిచంద్ర మధ్య పోటీ నెలకొనడంతో పాటున్ టీఆర్ఎస్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా పరిశీలించడంతో అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ప్రకటన ఆలస్యమైంది. ఈ స్థానం నుంచి బలమైన ప్రత్యర్థులు రంగంలో ఉండడంతో ఒక దశలో వేరొకరిని బరిలోకి దించాలని కాంగ్రెస్‌ అధినాయకులు భావించారు.

అయితే అన్ని విధాలుగా ఆలోచించిన పిదప రేణుకా అయితే మంచిదనే నిర్ణయానికి ఏఐసీసీ వచ్చి ఆమె పేరును ప్రకటించింది. దీంతో మొత్తం 17 నియోజకవర్గాల్లో రెండు విడతల్లో 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం ఖమ్మం స్థానాన్ని పెండింగ్‌లో పెట్టి ఊహాగానాలకు తెరదీసింది. 1994,2004 లోక్‌సభ ఎన్నికల్లో రేణుకా చౌదరి ఖమ్మం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ఖమ్మం బరిలో మరోసారి తలపడబోతున్నారు. అయితే గతంలో లాగే ఈసారి కూడా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతుండగా నామా మాత్రం ఈసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ను ఇంతవరకు కైవసం చేసుకోని టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు రేణుకా చౌదరి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఖమ్మంలో గెలుపెవరిది అనే దాని మీద ఆసక్తి నెలకొంది.