పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా : కెటిఆర్

SMTV Desk 2019-03-16 18:54:21  ktr, lagonda, trs working president

నల్గొండ, మార్చ్ 16: శనివారం నల్గొండ సభలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా అని, నల్గొండ పార్లమెంట్ సీటులో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. దేశానికి ప్రధాని మోడీ ఎదో చేస్తారని ప్రజలు ఆశించారని.. కానీ, మాటలు, నినాదాలు తప్ప దేశానికి మోడీ చేసిందేమి లేదని విమర్శించారు. మోడీ చరీష్మా తగ్గిందని అన్ని జాతీయ సర్వేలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కు జోష్ లేదని, అలాగే బిజెపి జోష్ కూడా తగ్గిందన్నారు. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎకు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. పుల్వామాలో ఉగ్రదాడిపై ముఖ్యమంత్రి కెసిఆర్ అంత గొప్పగా ఎవరూ స్పందించలేదని తెలిపారు. సిఎం కెసిఆర్ తెచ్చిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ప్రధాని కూడా రైతుబంధు పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు సైతం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వలేదని, టిఆర్ఎస్ కు 16 ఎంపి సీట్లు వస్తే జాతీయ హోదా తన్నుకుంటూ వస్తుందని స్పష్టం చేశారు.