ఒకరు బోఫర్స్ మరొకరు రాఫెల్ కుంభకోణం చేశారు

SMTV Desk 2019-03-14 09:45:06  ktr, kcr, rafale,

హైదరాబాద్, మార్చ్ 14: లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బుదవారం సికిందరాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, “సబ్ కే సాత్.. సబ్ కే వికాస్” అని చెప్పే ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకి హ్యాండ్ ఇచ్చారు. ప్రజలకే కాదు బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయకు కూడా హ్యాండ్ ఇచ్చారు. కేంద్రమంత్రిగా ఉన్న ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి తెలంగాణ ప్రజలందరినీ అవమానించారు. ఆయనను పదవిలో నుంచి తప్పించడానికి కారణం కూడా చెప్పలేదు. ఆయనను పదవిలో నుంచి తప్పించి కేంద్రమంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా చేశారు మోడీ.

రాష్టప్రజలు కట్టిన పన్నులలో కేంద్రం నుంచి మనకు రావలసిన వాటాను మాత్రమే ఇచ్చారు తప్ప రాష్ట్రానికి అదనంగా ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తాను అధికారంలోకి వస్తే విదేశాలలోని నల్లధనం వెనక్కు రప్పించి దేశంలో ప్రతీ పేదవాడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. కానీ ఒక్క పైసా వేయలేదు. నరేంద్రమోడీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతారు?

అయినా దేశంలో మోడీ లేకపోతే రాహుల్ గాంధీ మాత్రమే అధికారంలో ఉండాలా? దేశంలో వేరెవరూ నాయకులే లేరా?వారిని ప్రజలు ఎన్నుకొంటే చేసిందేమిటి? ఒకరు బోఫర్స్ మరొకరు రాఫెల్ కుంభకోణం చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలు రెండు పార్టీలకు కలిపినా 273 సీట్లు గెలుచుకోలేవు. కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయం శక్తి అవసరముంది. ఆ బాధ్యతను ఫెడరల్ ఫ్రంట్ నిర్వర్తిస్తుంది,” అని అన్నారు.