దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జి తాజా సమాచారం

SMTV Desk 2019-03-10 12:47:52  Durgam cheruvu ,

హైదరాబాద్‌ నగరంవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేసి హైవేలు, అండర్ పాసులు, ఫ్లై ఓవర్లు వగైరాలు నిర్మిస్తోంది. దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి కూడా వాటిలో ఒకటి. రూ.184 కోట్లు వ్యయంతో దుర్గం చెరువుపై కేబిల్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. ఇది రోడ్ నెం.45-అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ-ఐ‌టి కారిడార్‌ లను అనుసంధానిస్తుంది.

ఇప్పటివరకు ఈ కేబిల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కాంక్రీట్ పనులు జరిగాయి. నేటి నుంచి కేబిలింగ్ పనులు మొదలవనున్నాయి. ఎల్&టి సంస్థకు చెందిన ఒక భారీ యంత్రం సహాయంతో ఈ కేబిలింగ్ పనులు మొదలుపెట్టబోతున్నారు. ఈ కేబిల్ బ్రిడ్జి పొడవు 754.83 మీటర్లు. దుర్గంచెరువుకు రెండువైపులా 233.8 మీటర్ల దూరంలో 57 మీటర్లు ఎత్తులో రెండు భారీ పైలాన్లు నిర్మించారు. వాటికి ఉక్కు తీగలు బిగించి, ఆ తీగలను బ్రిడ్జిపై చెరో వైపు ఉండే రెండు స్తంభాల గుండా పంపించి గట్టిగా బిగిస్తారు. దాంతో చెరువు మద్యలో ఎటువంటి ఆధారం లేకుండానే బ్రిడ్జి గాలిలో ఉక్కుతీగలపై నిలబడుతుంది.

ఈ కేబిల్ బ్రిడ్జితో పాటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల సుందరీకరణ పనులు కూడా జరుగుతున్నాయి. కనుక దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా చెరువుకు అడ్డంగా గాలిలో తేలియాడే కేబిల్ బ్రిడ్జ్, కిందన అందమైన పార్క్ హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా మారడం ఖాయం. ఈ పనులన్నీ పూర్తయి కేబిల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరొక 3-4 నెలలు పట్టవచ్చునని సమాచారం.