డేటా చోరీ కేసు: అమెజాన్‌, గూగుల్‌ నుంచి స్పందన రావాల్సి ఉంది

SMTV Desk 2019-03-09 16:03:56  Data breach, TS, AP

హైదరాబాద్, మార్చ్ 09: డేటా చోరీ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశామని తెలంగాణ సిట్‌ ఇన్‌ఛార్జి స్టీఫెన్‌ రవీంద్ర శనివారం మీడియాకు తెలిపారు. మాదాపూర్‌లో ఉన్న ఐటిగ్రిడ్స్‌ కార్యాలయంలో ఈ రోజు సిట్‌ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా స్టీఫెన్‌ రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. ఈ కేసు విచారణలో భాగంగా సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అమెజాన్‌, గూగుల్‌ నుంచి స్పందన రావాల్సి ఉందని, అందు కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. హైకోర్టులో అశోక్‌ వేసిన పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. పోలీసులు సీజ్‌ చేసిన పత్రాలు, డివైజ్‌లను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఫామ్‌-7 దరఖాస్తుపై ఎపి సిట్‌ తమను సంప్రదించలేదని ఆయన తేల్చి చెప్పారు.