ఓటుకు నోటు కేసు: తెలీదు, నాకేమీ గుర్తులేదు అన్న రేవంత్ రెడ్డి

SMTV Desk 2019-02-20 19:51:52  

ఓటుకు నోటు కేసు క్రమక్రమంగా తీవ్రతరం అవుతోంది. ఈడీ దర్యాప్తులో వేగం పెంచి కేసులో ఏ-1 నిందితుడిగా ఆరోపణలున్న రేవంత్ రెడ్డిని గట్టిగా విచారిస్తోంది. ఈ కేసు విషయంలో ఇది వరకే ఏసీబీ విచారణలు జరపగా ప్రస్తుతం ఈడీ కేసును టేకప్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రేవంత్ 50 లక్షలు ఇవ్వజూపుతున్న వీడియో ఆధారాలతో కేసు నమోదైంది . ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ కాల్ వాయిస్ కూడా కీలకంగా ఉంది.

ఈ కేసులో వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారులను, ఉదయసింహాను విచారించిన ఈడీ ఆ విచారణ ఆధారంగా నిన్న రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం గుప్పించింది. సుమారు 8 గంటలతోపాటు సాగిన ఈ విచారణలో 50 లక్షల డబ్బు ఎలా సమకూర్చారు, మిగిలిన 4.5 కోట్లు ఎవరు సర్దారు, అవిప్పుడు ఎవరి వద్ద ఉన్నాయి, ఆ డబ్బు ఏర్పాటులో ఎవరెవరు సహకరించారు వంటి అంశాలపై నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారట. విచారణలో రేవంత్ చాలా ప్రశ్నలకు తెలీదు, నాకేమీ గుర్తులేదు అనే సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఆ సమాధానాలతో సంతృప్తి చెందని ఈడీ ఈరోజు కూడా విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది.