మిత్ర పక్షాలను లెక్కచెయ్యని బీజేపీ: విజయశాంతి

SMTV Desk 2019-02-07 08:45:49  Vijaya Shanthi, Narendra Modi, Amit Shah, Chandrababu Naidu, Congress, TDP, Shivasena, BJP

హైదరాబాద్, ఫిబ్రవరి 07: కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా పై ఘాటు విమర్శలు గుప్పించారు. బీజేపీ లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధిపత్య వైఖరి ఎక్కువైందని, ఆ పార్టీ ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుండడం వల్లే పార్టీకి సీనియర్లు దూరమవుతున్నారని వెల్లడించారు. వారి కూటమిలోని మిత్ర పార్టీలను బీజేపీ లెక్కచేయడం లేదని, వాటి అవసరం లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా కలలు కంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికలు మోదీకి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతాయని ఆయన చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఇలా ఓ వ్యక్తి చుట్టూ బీజేపీ తిరగడం వల్ల, మోదీ ఆధిపత్య వైఖరి వల్లే ఆ పార్టీకి సీనియర్ నేతలు టాటా చెబుతున్నారని ఆమె విమర్శించారు. ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు తప్పుకోవడానికి కూడా కారణం అదేనని ట్విట్టర్ లో విజయశాంతి పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీలో ఇంకా మోదీ భజనే జరుగుతుండడం ఆయన నిరంకుశత్వానికి అద్దం పడుతోందని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.