ఒమన్‌ ఉచ్చులో చిక్కుకున్నా తెలంగాణ అమ్మాయి

SMTV Desk 2019-02-03 17:42:51  Sushma Swaraj, Shahidha Begam, Rashidha Begam, Oman

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఒక తల్లి మరో తల్లిని తన బిడ్డను రక్షించమని వేడుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా తన కూతురును కాపాడాలంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఉద్యోగం కొరకు ఒమన్‌ వెళ్లిన తన కుమార్తె ఉచ్చులో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన షహీదా బేగం అనే మధ్యవర్తి ద్వారా తన కూతరు ఒమన్‌కు వెళ్లిందని తెలిపారు. బాధితురాలి తల్లి రషీదా బేగం మాట్లాడుతూ, షహీదా అనే మధ్యవర్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మమ్మల్ని సంప్రదించింది. నెలకు రూ.25 వేల వరకు జీతం ఇస్తారని నమ్మబలికింది. ఆమెపై నమ్మకంతో నా కుమార్తెను గత డిసెంబరు 9న ఒమన్‌కు పంపాను. కానీ అక్కడికి చేరుకున్న తరవాత ఆమెను ఓ కార్యాలయంలో బంధించారు. అనుమతి లేకుండానే అనేక ప్రాంతాలకు తరలిస్తున్నారు. కనీసం సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. దీనిపై మధ్యవర్తి షహీదాను సంప్రదించగా రూ.రెండు లక్షలు డిమాండ్‌ చేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కూతురు ఎంతో వేదనను అనుభవిస్తోందని, వీలైనంత త్వరగా మధ్యవర్తుల చెర విడిపించాలంటూ సుష్మా స్వరాజ్‌ను రషీదా కోరారు.