ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం

SMTV Desk 2019-01-31 10:32:29  Nampalli Exhibition grounds, Fire accident, Hyderabad

హైదరాబాద్, జనవరి 31: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎక్సిబిషన్ లోని దుకాణాలు కాలిపోవడం తో భారీ గా ఆస్తి నష్టం జరిగింది. వొక దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దుకాణాలు అధిక శాతం ప్లాస్టిక్, కర్రలతో చేయడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్తలానికి చేరుకునే లోపే సుమారు 100 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రాత్రి 8.30గంటల సమయంలో పారిశ్రామిక ప్రదర్శనలోని మహేశ్‌ బ్యాంక్‌ స్టాల్‌లో విద్యుదాఘాతం సంభవించి మంటలు రేగాయని ప్రాధమికంగా నిర్ధారించారు. మంటలను అదుపు చేసే లోపే ఆంధ్ర బ్యాంకు స్టాల్ కు మంటలు వ్యాపించాయి. దాంతో ఆంధ్ర బ్యాంకు మేనేజర్ మూర్తి పోలీసులకు, అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం అందించాడు. డీసీపీ విశ్వ ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌, పోలీస్‌ సిబ్బంది సహాయంతో ఎగ్జిబిషన్‌లో ఉన్న వారిని బయటకు రప్పించారు. ఘటనన జరిగినప్పుడు నుమాయిష్ లో దాదాపు 40 మంది సందర్శకులు ఉన్నట్లు పోలీసుల అంచనా.

సందర్శకులను సురక్షితంగా బయటకు పంపేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ విపత్తు నివారణ బృందం తీవ్రంగా శ్రమించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలం నుంచి బయట పడిన వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ 84 ప్రత్యేక బస్సులు నడిపింది. అంతేకాకుండా మెట్రో రైల్ లో ఉచితంగా ప్రయాణించవచ్చని మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ తదితరులు వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. దిల్లీలో ఉన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీ కుమార్‌ అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగలేదు. క్షతగాత్రులను కేర్ ఆసుపత్రికి తరలించారని పోలీసులు చెప్పారు.