రేవంత్‌ రెడ్డి vs జితేందర్ రెడ్డి

SMTV Desk 2019-01-28 13:12:51  Assembly, Jithender Reddy, revanth reddy

అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుస్తానని ఆశిస్తే ఓటమిపాలవడంతో షాక్ అయిన తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి మెల్లగా ఆ షాక్ నుంచి కోలుకొని లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆయన మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు తాజా సమాచారం. వొకవేళ అక్కడి నుంచి రేవంత్‌ రెడ్డి పోటీ చేయదలిస్తే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస ఎంపీ జితేందర్ రెడ్డితో పోటీ పడవలసి ఉంటుంది.

మొదటి నుంచి ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డికి ఆ నియోజకవర్గంపై మంచి పట్టే ఉందికనుక మళ్ళీ పోటీ చేయడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు కానీ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన రేవంత్‌ రెడ్డి ఈసారి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంపరిధిలోని నారాయణ్ పేట, మహబూబ్‌నగర్‌, జడ్చెర్ల, దేవరకద్ర, మక్తల్ 5 అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు సాధించవలసి ఉంటుంది. పైగా అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలలో వరుసగా ఘనవిజయాలు సాధించి మంచి ఉత్సాహంతో ఉన్న తెరాస లోక్‌సభ ఎన్నికలలో 16స్థానాలను గెలుచుకోబోతున్నామనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది లోక్‌సభ ఎన్నికలలో గెలిచి కేంద్రంలోకి వస్తుందనే అంశం కూడా రేవంత్‌ రెడ్డి ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వొకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు భావించినట్లయితే రేవంత్‌ రెడ్డిని గెలిపించవచ్చు. అదే బిజెపి లేదా కూటమి గెలిచే అవకాశం ఉందని ప్రజలు భావించినట్లయితే మళ్ళీ జితేందర్ రెడ్డినే గెలిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో గెలవాలంటే రేవంత్‌ రెడ్డి చాలా కష్టపడవలసి ఉంటుంది.