ఫెడరల్ ఫ్రెండ్ షిప్

SMTV Desk 2019-01-16 17:46:20  YSRCP, Jaganmohan reddy, ktr, federal friendship

హైదరాబాద్ , జనవరి 16: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో వైసీపీ నేత మాట్లాడుతూ, కేసీఆర్ తనతో ఫోన్ లో మాట్లాడారని... ఈరోజు తారక్ (కేటీఆర్) వచ్చి కలిశారని, అన్ని విషయాలను చెప్పారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు కలవాల్సిన పరిస్థితి తదితర అంశాలను వివరించారని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి పార్లమెంటులో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నామని... 25 మంది ఎంపీలతో పార్లమెంటులో చేసేదేమీ ఉండదని... తెలంగాణలోని 17 మంది ఎంపీలు కూడా మద్దతు ఇస్తే... అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి మెరుగవుతుందని జగన్ చెప్పారు. రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో తానే వచ్చి మరింత లోతుగా చర్చిస్తానని కేసీఆర్ ఫోన్ లో చెప్పారని తెలిపారు.

తమ సమావేశంలో కేటీఆర్ చెప్పిన అన్ని విషయాలపై పార్టీలో తాము మరింత లోతుగా చర్చించి, రాబోయే రోజుల్లో దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.