సూర్యుడికి నచ్చేది మాత్రం భోగి పండగే

SMTV Desk 2019-01-14 11:21:04  Happy Bhogi, Bhogi pallu,

చంటి పిల్లలకు దృష్టిదోష పరిహారార్ధం, ఆయుర్ వృద్ధి కోసం చేసే క్రతువు "భోగి పళ్ళు"....

సంక్రాంతిని తెచ్చేది సూర్యుడే అయినా.. సూర్యుడికి నచ్చేది మాత్రం భోగి పండగే!
ఉదయాన్నే వేసే భోగి మంటల్లో.. సాయంత్రం పోసే భోగి పళ్ళలో..
సూర్య ఛాయలు దర్శనమిస్తాయి. రంగులోను, ఆకారంలోను, పేరులోనూ కూడా సూర్యుణ్ణి పోలి ఉండే ఆర్క ఫలాలని (రేగుపళ్ళని) చిన్న పిల్లల తలమీదుగా పొయాలనే ఆచారాన్ని పెట్టారు. సూర్యశక్తి ఈ పిల్లలకి నిరంతరం ఉండుగాక! అని ఆశీర్వదించడం దీనిలోని భావం.

రేగిపళ్ళు, చిల్లరనాణేలు, చెరకుముక్కలు, పువ్వులు కలిపి పిల్లల తలమీదుగా దిగబారపోస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని బోడికలు పోయడం అంటారు.
ఇది చిన్న పిల్లలకి అందమైన తీపి జ్ఞాపకం, తోటి పిల్లలు రావడం, బంధువులు, ఇరుగుపొరుగు వచ్చి రేగుపళ్ళను తల మీద పోస్తూ దిష్టి తొలగిపోయి సుఖంగా ఉండాలని దీవిస్తుంటే.. ఇవేవి తెలియని చిన్నపిల్లలు కూడా వచ్చిన వాళ్ళందరూ తమ సంతోషాన్ని కోరుతున్నారని గ్రహించి ఆనందంలో మునిగిపోతారు.